Rudradhyayamu-visistata




రుద్రాధ్యాయము-విశిష్టత

పరమేశ్వరుని దృష్టిలో సృష్టి`స్థితి`ల‌యాలు క్షణికాలు. అంటే కనురెప్ప‌ తెరచిమూసేంత సమయంలో పూర్తయ్యే నిరంతర ప్రక్రియ. అలా భగవంతుడి లీలావినోదంలో భాగంగా జన్మించిన మానవుడు దీర్ఘకాలిక ఆయుర్దాయాన్ని పొందాల‌నుకుంటాడు. కానీ ప్రకృతిశక్తులు అంతసులువుగా వదిలిపెట్టవు. తమ ప్రభావాన్ని అతడికి అనుక్షణం గుర్తు చేస్తుంటాయి. మనిషి తమను దుర్వినియోగం చేయకుండా పరీక్షిస్తుంటాయి. ఈ ప్రకృతి శ‌క్తుల‌న్నీ శివస్వరూపాలు. అష్టమూర్తి స్వరూపుడైన శివుడిలో అంతర్భాగాలు. ఆ ప్రకృతి స్వరూపుడైన శివుడు అనుగ్రహిస్తే పంచభూతాలూ అనుకూలిస్తాయి. అటువంటి రుద్రుడు ఏవిధంగా మనకు ప్రసన్నుడవుతాడో తెలియచేసేదే శ్రీరుద్రాధ్యాయము.
‘‘రోదయతి సర్వం అంతకాలే ఇతి రుద్రః’’ ప్రళయకామందు సంహారముతో సర్వమును రోదన చేయించువాడు కనుక శివుడికి రుద్రుడని పేరు. కృష్ణయజుర్వేదం కూడా ‘‘సోరోదీద్యదరోదీత్తద్రుద్రస్య రుద్రత్వం’’ రోదన చేయించువాడు కాబట్టి రుద్రుడు అని తెలియచేస్తోంది. అలాంటి రుద్రుడిని స్తుతించేదే ‘‘శతరుద్రము’’. దీనినే రుద్రాధ్యాయము అనికూడా అంటారు.

‘‘వేదాస్త్రయస్త్రయీ’’ అని అమరకోశమందు చెప్పబడ్డట్లుగా ఋగ్యజుస్సామ వేదాల‌ను కలిపి త్రయీ అని పేరు. ఈ మూడింటిలో మధ్యలో ఉండేది యజుర్వేదం. దీనిలోని ఏడుకాండసంహితలో మధ్యలోని నాల్గ‌వ‌కాండాంతర్గతమైన ఐదవ ప్రపాఠకానికే రుద్రాధ్యాయమని పేరు. ఈ అధ్యాయంలో ‘‘నమః’’ అనే శబ్దం 153 సార్లు వస్తుంది. అందుకే దీన్ని నమకమని వ్యవహరిస్తారు. యాజ్ఞీకులు దీనిని యజ్ఞోపయోగ కాండగా,                    ఉపాసకులు ఉపాసనాకాండగా, తాత్వికులు జ్ఞానకాండగా వ్యవహరిస్తారు. దీనిలోనుండి గ్రహించినదే ‘‘నమశ్శివాయ’’ అనే శివపంచాక్షరీ మంత్ర. ఇన్ని విశేషాల‌ కారణంగా ఇది ప్రాధాన్యతను పొందిది. ఇక ఏడవ ప్రపాఠకమందు ‘‘చ-మే’’ అనే అక్షరాలు  350 సార్లు వస్తాయి. అందువల‌న దీనిని చమకమని అంటారు.

రుద్రునికి అఘోరా శరీరము, శివా శరీరము అని రెండు శరీరములుంటాయని వేదం చెబుతోంది. ‘‘రుద్రోవా ఏష యదగ్ని స్తస్యైతే తనువౌఘోరాన్యా శివాన్యా యచ్ఛతరుద్రీయం జుహోతి  యైవాస్య ఘోరాతనూస్తాం తేనశమయతి’’. ఈ శతరుద్ర హోమ, అభిషేకాదుల వల‌న క్రోధస్వభావముగల‌ అఘోరాశరీరము శాంతినిపొంది ప్రసన్నమవుతుందని తైత్తిరీయ సంహిత తెలియచేస్తోంది.
ఇదే విషయాన్ని రుద్రాధ్యాయము ‘‘యాతే రుద్రశివా తనూరఘోరా పాపకాశినీ’’ ఓ రుద్రదేవా! ‘‘నీ తనువు శివ,అఘోరా,అపాపకాశినీ అనురూపముల‌తో ఉన్నది. అట్టి అఘోరా శరీరము క్రోధ స్వభావమైనది’’. అంటూ ప్రారంభమవుతోంది. అటువంటి క్రోధస్వభావముగల‌ శరీరము ప్రసన్నతను పొందుటకే రుద్రము ‘‘నమః’’ అనే శబ్దముతో ప్రారంభమైంది. ‘‘నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః। నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యా ముతతే నమః’’ ఓ రుద్రా నీ క్రోధానికి నమస్కారము. క్రోధ రూపుడవైన నీకు నమస్కారము. నీ క్రోధము మాయందు లేకుండా మా శత్రువుల‌యందు ప్రవర్తించుగాక. ‘‘యాత ఇషుశ్శివతమా శివంబభూవతే ధనుః। శివాశరవ్యాయా తవతయానో రుద్రమృడయ’’ ఓ రుద్రా! ‘‘నీబాణానికి నమస్కారము. నీ ధనస్సుకు నమస్కారము. ధనుర్బాణము కలిగిన నీ బాహువుకు నమస్కారము. నీ ధనుర్బాణము మాయందు శాంతిగా ఉండి మా శతృవుయందు ప్రవర్తించుగాక’’.

స్మృతి, ఆగమ, పురాణాదుల‌లో రుద్రాధ్యాయము బహుముఖంగా ప్రస్తుతించబడింది. పవిత్రమైన ఈ రుద్రాధ్యాయ పారాయణవ‌ల్ల‌ అమృతత్వం కలుగుతుందని ‘‘జాబాలోపనిషత్తు’’ చెబుతుంది. ‘‘యశ్శత రుద్ర మధీతే సోగ్నిపూతో భవతి’’ ఎవరు రుద్రాధ్యాయాన్ని పఠిస్తారో వారి పాపాల‌న్నినశించి  అగ్నివలే పునీతుల‌వుతారని ‘‘కైవల్యోపనిషత్తు’’  ప్రస్తుతించింది. ‘‘రహసికృతానాం మహాపాతకానామపి శతరుద్రీయం ప్రాయశ్చిత్తం’’ తెలిసీ తెలియక చేసిన పాపాల‌న్నింటికి ఈ శతరుద్రం ప్రాయశ్చిత్తమంటూ శంఖస్మృతి తెలియజేస్తోంది. అదేవిధంగా యాజ్ఞవ‌ల్క్యుడు కూడా ‘‘సర్వపాప హరాహ్యేతే రుద్రైకాదశనీ తథా’’ ఏకాదశ రుద్రపారాయణచే సర్వపాపముల‌నుండి పరిశుద్ధుల‌వుతారని కీర్తించాడు. శాతాతపోపనిషత్తు, వాయుపురాణము, అత్రిస్మృతి, మరియు ఆపస్తంబసూత్రాలు మొదలైన గ్రంథాల‌న్నీ రుద్రసూక్త మహిమను గురించి ఉద్ఘోషిస్తున్నాయి.
నమకములో 11అనువాకములున్నాయి. ఒకటవ అనువాకం రుద్రుని తనువు గురించి, రెండవది లీలార్థదేవతామూర్తి, మూడవది చోరమూర్తి, నాల్గ‌వ   అనువాకంలో నానాజాతిమూర్తి వివరణలు ప్రధానంగా ప్రశంసించబడ్డాయి. ఐదవ అనువాకంనుండి తొమ్మిదవదాని వరకు సర్వస్వరూపుడైన పరమేశ్వరుడు ప్రస్తుతించబడ్డాడు. దశమ, ఏకాదశ అనువాకాల‌లో ఉగ్రరూప మంత్రాలు చెప్పబడ్డాయి.

ఓ త్య్రమ్బకా! ‘‘బాగా పండిన దోసపండు దానంతట అదే తీగనుండి విడివడినట్లుగా పూర్తిజీవితాన్ని అనుగ్రహించి, సహజమైన మరణాన్ని ప్రసాదించు’’. అనే చక్కని ప్రార్థనతో ముగుస్తోంది నమకప్రశ్న.

ప్రకోపించిన శక్తుల‌ను శాంతింపచేసుకునేందుకు మనిషి అనేక వరాల‌ను పొందేందుకు ప్రయత్నిస్తాడు. ఇదేసత్యాన్ని మనకు చమకం తెలియచేస్తోంది. ప్రపంచంలోని ప్రతి ప్రాణకోటికీ క్షేమం కల‌గాల‌ని ప్రార్థించే మంత్రాలు చమకంలో ఉన్నాయి.

పరమేశ్వరుని విశ్వరూపం అనేకవిధాలుగా చెప్పబడింది. ‘‘రుద్రోవా ఏషయదగ్ని:’’ రుద్రుడు అగ్నిస్వరూపమంటోంది తైత్తిరీయసంహిత. అటువంటి అగ్నిస్వరూపుడైన శివుని విషయంలో ఎల్ల‌ప్పుడూ అప్రమత్తంగా మసుకోవాలి. పరమేశ్వర స్వరూపమైన ప్రకృతిని, ప్రకృతిలోని జీవరాశుల‌ను గౌరవించి ప్రేమించాలి. సత్కర్మాచరణతో జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి. ఇదే రుద్రాధ్యాయంలోని అర్థం. ఇదే మానవజన్మకు పరమార్థం.


శ్రీశైల‌ప్ర‌భ‌, జనవరి`2017
Share on Google Plus

About https://vaidikagrandhanidhi.blogspot.com/

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment