Pages

▼

18 June 2019

ఆది శంక‌రులే ఆద‌ర్శం


"ఆది శంక‌రులే ఆద‌ర్శం"
5 May

ఒక‌ స‌న్యాసి భిక్షాట‌న‌చేస్తూ ఎదురుగా ఉన్న గుమ్మం ముందు నిల‌బ‌డి ‘భ‌వ‌తి భిక్షాందేహి’ అని అన్నాడు. క‌టిక‌ద‌రిద్రంతో బాధ‌ప‌డుతున్న ఆ ఇంటి ఇల్లాలు అత‌నిని వ‌ట్టిచేతుల‌తో పంప‌కుండా ఏదైనా భిక్ష‌వేద్దామ‌ని ఇల్లంతా వెదికి ఓ మూల‌న దొరికిన‌ ఉసిరికాయ‌ను తెచ్చిపాత్ర‌లోవేసింది. నిండుమ‌న‌సుతో దాన్ని స్వీక‌రించిన ఆ స‌న్యాసి వెంట‌నే ల‌క్ష్మీదేవిని స్తుతిస్తు ఆశువుగా ఒక స్తోత్రాన్ని చ‌దివారు. దాంతో క‌న‌క‌వ‌ర్షం కురిసింది. ఆ స్తోత్ర‌మే క‌న‌క‌ధారా స్తోత్రం. ఆ స‌న్యాసి ఆది శంక‌రులు.

 భౌగోళికంగా ఏకంగా కనపడుతున్నప్పటికీ, సిద్ధాంతపరంగా ఛిన్నాభిన్నంగా మారిన భారతదేశం ఒకమహాపురుషుడి అవతరణకోసం ఎదురుచూస్తున్నస‌మ‌యంలో కేరళరాష్ట్రంలోని కాలడిలో ఆర్యాంబ-శివగురువు దంపతులకు జన్మించిన శ్రీ‌శంక‌రులు అత్య‌ల్ప‌మైన 32సంవత్సరాల‌ ఆయుర్దాయంలోనే ఎన్నో ఘనకార్యాలు సాధించారు.

వివిధ ర‌కాలైన అవైదిక పోక‌డ‌ల‌తో ఆనాటి  స‌మాజంలో నెల‌కొన్న అశాంతిని తొల‌గించేందుకు దేశమంతటా తిరిగి త‌న పాండిత్య ప్ర‌తిభ‌తో వేద‌విరుద్ధ‌మైన అనేక మ‌తాల పండితుల‌ను, వారి సిద్ధాంతాల‌ను ఖండించి వైదికమార్గాన్ని ఏర్ప‌ర‌చారు. ష‌ణ్మ‌తాల‌ను ప్ర‌తిపాదించి షణ్మతస్థాపనాచార్యుల‌ని కీర్తిగాంచారు. శ్రుతి,స్మృతి,పురాణ ప్రతిపాదితమైన  అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు.
***

3. వాలే వయసులో వ్యాకరణమా!

జీవితపు చివరి దశలో  తన ఇంటి వసారాలో కూర్చొని వ్యాకరణ సూత్రాలను వల్లె వేస్తున్న ఉన్న ఒక పండితుడు శంకరుల కంటపడ్డారు. వెంటనే ఈ వయసులో చెప్పవలసింది వ్యాకరణ సూత్రాలు కాదని గోవిందుని నామస్మరణ చేయమని చెబుతూ భజగోవిందస్తోత్రాలను రచించారు. కేవలం పాండిత్యం మాత్రమే భగవంతుని ముక్తిని ప్రసాదించదని ప్రబోధించారు.
***

4. కఠిన పరీక్షకు నిలిచి....

 బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసేందుకు సిద్ధపడ్డారు శంకరులు. భాష్యరచన కొనసాగుతుండగా వచ్చాడు ఒక వృద్ధుడు. బ్రహ్మ సూత్రాలలోని అనేక సందేహాలపై తన ప్రశ్నల పరంపర సంధించాడు. రోజుల తరబడి కొనసాగిన చర్చలో వాటన్నింటికి నేర్పుతో సమాధానమిచ్చారు శంకరులు. వచ్చిన వచ్చినవారు సాక్షాత్తు వ్యాసభగవానులని తెలుసుకొని పొంగిపోయారు శంకరులు . శంకరుల పాండిత్యాన్ని గమనించి భాష్యరచనకు సరైన వ్యక్తని దీవించి వెళ్ళాడు వ్యాసుడు. చేస్తున్న పనిపై సాధికారత, శ్రద్ధ, పట్టుదల ఉంటే  పెద్దల ప్రోత్సాహం కూడా లభిస్తుందనే దానికి తార్కాణం ఈ ఘటన.

***

5. ఉన్నదొక్కటే......

జీవుడే బ్రహ్మం... బ్రహ్మమే జీవుడు. ఆ ఇద్దరికీ తేడాలేదు. ‘నువ్వు వేరు... నేను వేరు’ అనే సంకుచిత మార్గం విడ‌నాడి ‘అందరమూ ఒకటే’ అన్న విశాల మార్గంలో న‌డ‌వాలి. తనను తాను తెలుసుకోగలగాలి. మనల‌ను ఈశ్వరునిలో అనుసంధానించుకోవాలి. ఇక అప్పుడు అంతా అద్వైతమే!  అటువంటి అద్వైత స్థితి మనందరికి కల‌గాల‌నే తపనతో భావితరాలకు జ్ఞానమార్గం చూపిన దార్శనికులు శ్రీ‌శంక‌రులు. వారి జీవనం ఆదర్శవంతమైన సందేశం.


అప్పాల శ్యామ‌ప్ర‌ణీత్ శ‌ర్మ అవ‌ధాని
వేద‌పండితులు