Pages

▼

12 March 2019

Holika Purnima

ఫాల్గుణ శుద్ధ పూర్ణిమని మహా పూర్ణిమ, హోళికా పూర్ణిమ, డోలా పూర్ణిమ, కామదహనోత్సవంగా వ్యవహరిస్తారు. ఉత్తర భారత దేశంలో హోళికా పూర్ణిమ ప్రధానంగా జరుపుకుంటే, దక్షిణ భారత దేశంలో కామదహనోత్సవాన్ని జరుపుతారు. శివకళ్యాణం అనే మహత్తరకార్యం కోసం తపోదీక్షలో ఉన్న శివుని తపస్సుని భంగం చేసిన మన్మధుణ్ణి, తన మూడో నేత్రంతో భస్మం చేసిందీనాడే మరియు మన్మధుని భార్య రతీదేవి కోరిక మేరకు ఆమె కొక్కదానికే అతడు కనిపించేలాగా వరము ఇచ్చాడు శివుడు. మనలో ఉన్న కామక్రోధాదులనే అరిషడ్వర్గాలని దహనం చేసి, ప్రశాంతమైన జీవనం సాగించాలని కోరుతూ, శివుని ప్రార్థిస్తూ చేసే ఉత్సవమే ఈ కామదహనోత్సవం. అంతేగాకుండా రాబోయే వసంతాగమనాన్ని పురస్కరించుకుని కూడా ఉత్సవం చేస్తారు.
ఉత్తర భారతదేశంలో హిరణ్యకశిపుడి చెల్లెలైన హోళిక, విష్ణుభక్తుడైన ప్రహ్లాదుణ్ణి చంపబోయి తానే దగ్ధమైన సంఘటనకి గుర్తుగా, చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకుంటారు. ఆ రోజు సాయంకాలం మంటల్లో హోళికని దగ్ధం చేసే కార్యక్రమం జరిపి మరునాడు ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ మిఠాయిలు పంచుతూ ఆనందంగా కాలం గడుపుతారు. హోలికా పూర్ణిమ రోజు చందనంతో కూడిన మామిడి పూత (చూత కుసుమ భక్షణం) ను స్వీకరించాలని శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి.
ఈ రోజు శ్రీకృష్ణుని ఊయలలో వేసి ఆరాధించే ఉత్సవంగా డోలా పూర్ణిమ చేస్తారు. తమిళనాడులోని మధురైలో మీనాక్షీ సుందరేశ్వరుల కళ్యాణం జరిగిన రోజు కనుక కళ్యాణ పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు మధురైలో అమ్మవారి అయ్యవార్ల కళ్యాణం జరుపుతారు.