
మార్గశిర పౌర్ణమినే మహామార్గశీర్షం అనిఅంటారు. ఈనాడు నరకపూర్ణిమావ్రతం చేయాని ‘‘చతుర్వర్గచింతామణి’’ అనేగ్రంథములో ఉన్నది. వైద్యశాస్త్రం ప్రకారం కార్తిక పున్నమినుండి మార్గశిర పున్నమవరకు ఉన్నకాలాన్ని యమదంష్ట్రలు అని అంటారు. అంటే ఈ రోజులో యముడు కోరలుచాచుకొని ఉంటాడని అర్థం. దీన్ని వైద్యపరంగా విశ్లేషిస్తే ఈ రోజులన్ని వాతావరణ మార్పుకారణంగా అనారోగ్యానికి కారకాలు అవుతాయి. మరణాలు ఎక్కువ. ఈ దోషాలన్ని తొలగడానికి రొట్టెలనుకొరికి కుక్కలకు వేయడమనే ఒక ఆచారం ఉండేది. దానివలన ఆయురారోగ్యాలను పొందగలమని పెద్దలమాట.
మార్గశిర పౌర్ణమిని దత్తజయంతి అని వ్యవహరిస్తారు. ఈనాడు దత్తుని ఆరాధన చేస్తారు. ఈపండగ గురించి స్మృతికౌస్తుభమనే గ్రంథం వివరిస్తున్నది.
పురాణకథనం ప్రకారం ఒకనాడు నారదుడు తనభక్తిచేత విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకొన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి నారదుడినిచూచి అతని భక్తికిమెచ్చి ఏదైనా వరం కోరుకోమనగా, నారదుడు విష్ణుమూర్తి యెక్క సత్వరూపాన్ని చూపించమని వేడుకున్నాడు. దాంతో విష్ణువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఒక్కటిచేయగలిగితే నీవు కోరింది నెరవేరుతుందని చెప్పాడు. తరువాత నారదుడు భూలోకానికి వచ్చాడు. ఎలాగైనా త్రిమూర్తులను ఒక్కటి చేయాని సంకల్పించి అత్రి మహర్షి ఆశ్రమానికి వెల్లగా ఆ సమయంలో మహర్షి ఆశ్రమంలో లేడు. దానితో అత్రిభార్య అనసూయ నారదునికి స్వాగతంపలికి అతిథి మర్యాదలను చేసింది. దానికి సంతోషించిన నారదుడు తనపథకానికి అక్కడినుండే వ్యూహాన్ని తయారుచేసుకొన్నాడు.
నారదుడు వెంటనే అక్కడినుండి వైకుంఠానికి వెళ్ళి మూడులోకాలలోను అనసూయను మించిన పతివ్రత లేదని లక్ష్మీదేవితో చెప్పాడు. దానితో అసూయ చెందిన లక్ష్మీదేవి విష్ణుమూర్తిని పంపి అనసూయ పాతివ్రత్యాన్ని పరిక్షిస్తానని నారదునితో చెప్పింది. తనకార్యం ప్రారంభం కాబోతున్నందుకు మనసులో సంతోషించిన నారదుడు రెండవ ప్రయత్నంగా కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో పార్వతితో అనసూయ ఖ్యాతిని వివరించాడు. దాంతో పార్వతిదేవి శంకరున్ని పంపి అనసూయ పాతివ్రత్యాన్ని పరిక్షిస్తానని నారదునితో చెప్పగా నారదుడు ‘‘నారాయణ నారాయణ’’ అంటూ అక్కడినుండి చివరి మజిలీ అయిన బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడకూడా అదే సంగతినిచెప్పగా సరస్వతీ దేవిసైతం మిగతా ఇద్దరిలాగే స్పందించి పరీక్షకై బ్రహ్మను పంపుతానని చెప్పింది. దానితో నారదుడు లోక కళ్యాణ కారకమైన తన సంకల్పం నెరవేరబోతున్నందుకు సంతోషించి తన త్రోవన తాను వెళ్ళిపోయాడు.
అనంతరం భార్యల ఆలోచనఫలితంగా త్రిమూర్తులు ముగ్గురు బ్రాహ్మణవేషంలో అత్రిమహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. వారుముగ్గురు తమకు ఆకలిగా ఉన్నదని అన్నంపెట్టమని కోరగా సంతోషంతో అందుకు సిద్ధమైన అనసూయ. అయితే వచ్చిన ఆ ముగ్గురు బ్రాహ్మణులూ అనసూయకు ఒకషరతు విధించారు. అనసూయ నగ్నంగా వడ్డించాన్నదే ఆ షరతు.
ఆ మాటవిన్న అనసూయ ఆశ్చర్యపోయింది. తనభర్త అత్రి మహర్షితో విషయమంతా చెప్పింది. ఆయన తన తపోదృష్టితో దర్శించి వచ్చినవారు సామాన్యులు కారని, సాక్షాత్తు త్రిమూర్తులని, తమని పరీక్షించడానికి వచ్చారని తెలుసుకొని సంతోషపడ్డారు.
వారు విధించిన షరతు ప్రకారం మహర్షి తనమంత్రోదకాన్ని అనసూయకు ఇవ్వగా ఆమె దాన్ని ఆ ముగ్గురు బ్రాహ్మణుల స్వరూపంలో ఉన్నవారి మీద చల్లింది. దానితోవారు పసిపిల్లలు అయిపోయారు. అప్పుడు అనసూయ ఆ ముగ్గురికి స్తన్యమిచ్చి ఆకలి తీర్చింది. ఇంతలో అక్కడికి నారదమహర్షి విచ్చేశారు. మూడులోకాలనేలే త్రిమూర్తులు పసిపిల్లలై అక్కడ ఆడుతుండటం చూచి ఈ విషయాన్ని త్రిమూర్తుల భార్యలకు చెప్పాడు నారదుడు. దాంతో ఆ ముగ్గురమ్మలు అత్రి మహర్షి ఆశ్రమానికివచ్చి అక్కడ పసిపిల్లలై ఆడుతున్న తమభర్తలను చూశారు. దాంతో వారికి అనసూయ పాతివ్రత్యశక్తి తెలిసి గర్వభంగమైంది. వెంటనే ఆ ఋషిదంపతుల వద్దకువెళ్ళి తమభర్తలను తమకు తిరిగి అప్పగించమని ప్రార్థించారు. భర్తఆజ్ఞతో తిరిగి మంత్రోదకాన్ని వారిమీద చల్లగావారు మామూలుగా మారిపోయారు. అనసూయ పాతివ్రత్యాన్ని మెచ్చిన త్రిమూర్తులు ఏదైనా వరాన్ని కోరుకోమనగా ఆమె త్రిమూర్తులు ముగ్గురు కలిసి తనకు పుత్రునిగా జన్మించమని ప్రార్థించింది. ‘తథాస్తు’ అని పలికి త్రిమూర్తులు వారివారి లోకాలకు వెళ్ళారు.
అనంతరం కొంతకాలానికి అత్రి-అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరప్రభావంతో ఆరుచేతులు మూడు తలలతో ఒక కుమారుడు జన్మించాడు. అతడే దత్తాత్రేయుడు. మధ్యలోని శిరస్సు విష్ణువుది. కుడిది శివునిది. ఎడమ శిరస్సు బ్రహ్మదేవునిది. ఆవిధంగా దత్తాత్రేయుని జన్మసంభవమైనది.
బ్రహ్మవిష్ణురుద్రు ముగ్గురు వేరుకారని, ఒక్కరేనని నిరూపించడమే ఈ దత్తావిర్భావ కథ ముఖ్య ఉద్దేశ్యం. అంతేకాదు పాతివ్రత్యముయొక్క శక్తిని లోకానికి చాటడానికి, పాతివ్రత్య ప్రభావముతో త్రిమూర్తులను కూడా పసిపిల్లలుగా చేయవచ్చనే సందేశాన్ని ఇవ్వడమే అంతర్లీనంగా దత్తాత్రేయుని చరిత్రలో మనకు కనపడుతున్నది.
దత్తాత్రేయుడు- మేడివృక్షం
దత్తాత్రేయునికి మేడిచెట్టంటే ఎంతోప్రీతి. విష్ణుసహస్రనామాలలో ‘న్యగ్రోధోదుంబరోశ్వత్థం’ అనిచెప్పబడిరది. న్యగ్రోధం, ఉదుంబరం మరియు అశ్వత్థవృక్షములలో..... ఉదుంబరం అంటే తనమాయతో సర్వప్రాణులను ఆవరించిఉండువాడని అర్థం. అందుకే అన్ని చెట్లలోకి మేడిచెట్టును దత్తాత్రేయునికి ప్రీతిగా చెబుతారు. ఈచెట్టుక్రింద కూర్చుని ఏదైనా మంత్రానుష్ఠానం చేస్తే మంత్రసిద్ధి కలుగుతుందని పెద్దలమాట.

Blogger Comment
Facebook Comment