గోపద్మ వ్రతకథ (ఆషాఢ శుద్ధ ఏకాదశి)
భారతదేశం కర్మభూమి. మనిషిలోనేగాకుండా పశుపక్ష్యాదులలో సైతం భగవంతుడ్ని దర్శించగలిగే జాతి మనది. సమస్తదేవతలకు ప్రతిరూపకంగా గోమాతను పూజించడమనేది మనకు అనాదిగా వస్తున్న సంప్రదాయం. గోమాత భూలోకానికంతటికీ మహాలక్ష్మి. ‘‘గవామంగేషు తిష్ఠన్తి భువనాని చతుర్దశ’’ అన్న ఆర్యోక్తిననుసరించి బ్రహ్మ`విష్ణు`మహేశ్వరులు, అష్టవసువులు, ఏకాదశరుద్రులు, ద్వాదశాదిత్యులు, విశ్వేదేవతలు, సప్తమరుత్తులు, నవగ్రహాలు, పంచభూతాలు, పుణ్యతీర్థాలు, సప్తసముద్రాలు, ఇలా ఒకటని చెప్పడమెందుకు....ముప్ఫైమూడు కోట్లదేవతలూ గోవుయొక్క అంగాలలో నివసిస్తు ఉంటారని పెద్దలమాట. అగ్ని, అమృతం, దేవతలు ఈ మూడింటి సంగమమే గోమాత.
అంతేకాదు.....ఎనిమిది రకాలైన మంగళస్వరూపాలలో గోవుకూడా ఒకటి. ‘‘గోమాత ఏకాదశ రుద్రులకు తల్లిలాంటిది. అష్టవసువులకు కూతురులాంటిది. ద్వాదశాదిత్యులకు సోదరిలాంటిది. అమృతానికి నివాస స్థానం గోవు’’ అంటూ యజుర్వేదం గోవు గొప్పదనాన్ని కీర్తిస్తోంది.
గోవును కాచే ‘గో’ విందుడు
శ్రీకృష్ణపరమాత్మకు గోసంపద అంటే అమితానందం. ఆయనకు గోపూజ ఎంతో ప్రియాన్ని కలిగిస్తుంది. అందుకే ‘‘నమోబ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ హితాయచ। జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమోనమ:’’ గోవును ఇష్టపడే పరమాత్మ నీకు నమస్కారం! అంటూ పురాణాలు ఆయనను కీర్తించాయి. గోవును పూజించడమంటే శ్రీకృష్ణుడ్ని పూజించడమే! లీలాశుకుడు అనే మహాభక్తుడు కృష్ణపరమాత్మను వర్ణిస్తు ‘‘శ్రీకృష్ణకర్ణామృతం’’ అనే కావ్యాన్ని రాశాడు. అందులో కృష్ణుడు ఎప్పుడు గోవులు, గోపాలకుల మధ్యలోనే తిరుగుతుంటాడని అద్భుతంగా వర్ణించాడు.
ఎక్కడైతే గోవులు నిత్యం పూజలందుకుంటాయో అక్కడ పాడిపంటలతో కళకళలాడుతుటుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ విరాటరాజు ఆస్థానం. పశుసంపద పుష్కంలగా ఉన్న విరాటరాజు గారి నగరంలో దుర్భిక్షం అనేదే లేదని మనకు మహాభారతం చెబుతోంది. అటువంటి గోమాతను శ్రద్ధాభక్తుతో పూజించిన వారికి సర్వవిధ పాపాలు తొలగి, శుభాలు కలుగుతాయని ఇలాంటి అనేక దృష్టాంతాలద్వారా మనం గ్రహించవచ్చు.
గోవుయొక్క పాదాలు ఏవిధంగా ఉంటాయో ఆ ప్రకారంగా ముగ్గుతో తీర్చిదిద్దుకోవటమే ‘‘గోపద్మం’’. అటువంటి గోపద్మాలను తులసికోట చుట్టు వేసుకొని దాని మధ్యలో కృష్ణపరమాత్మను ఆరాధించడమే గోపద్మవ్రతం.
ఒకానొక సమయంలో స్త్రీసంబంధమైన దోషాలనుండి నివృత్తికోసం కుంతీదేవి శ్రీకృష్ణుడ్ని అడుగగా కృష్ణుడు ఈవ్రతాన్ని కుంతీదేవికి ఉపదేశించాడు. తరువాత కాలంలో కృష్ణుడు తనచెల్లి సుభద్రచేత ఈనోము ఆచరింపచేశాడని భవిష్యపురాణ కథనం. గోపికలు కృష్ణపరమాత్మ అనుగ్రహాన్ని పొందేందుకు ఈవ్రతాన్ని చేసినట్టుగా కూడా చెబుతారు. ఈ వ్రతాన్ని ఆచరించాల్సిన పద్ధతి, ఉద్యాపన విధానమంతా భవిష్యోత్తర పురాణం, స్కాందపురాణం మొదలైనవాటిలో వివరించబడింది.
వివాహానంతరం సౌభాగ్యస్తలు ఈ గోపద్మవ్రతాన్ని ఐదుసంవత్సరాపాటు నియమంతో ఆచరించాలి. ఆషాఢశుద్ధఏకాదశి అంటే శయనైకాదశీ నాడు ప్రారంభించుకొని, చాతుర్మాస్యాల వరకు (అంటే.... ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వియుజం) ఈనాలుగు నెలలపాటు ప్రతీరోజూ ఉదయాన్నే నదీతీరంలోగాని, దేవాయంలోగాని, లేదా ఇంట్లోని తులసీబృందావనంవద్ద ముప్పైమూడు ముగ్గుపెట్టి ముప్షైమూడువత్తులతో దీపాన్ని వెలిగించాలి. తులసికోటచుట్టు ముప్పైమూడు ప్రదక్షిణలు చేయాలి. ఆనాటినుండి నాలుగునెలలపాటు ప్రతీరోజు ఈవిధంగా ఆచరించిన తరువాత, కార్తీక శుద్ధ ఏకాదశినాడు (బోధనైకాదశీ) యథావిధిగా పూజాదికాలను నిర్వహించి కథవిని వాయనదానం ఇవ్వాలి. తాంబూలాలను ఇచ్చి ఆశీస్సులను తీసుకోవాలి. దాంతో ఒకసంవత్సరం వ్రతం పూర్తిఅవుతుంది. ఇదేవిధంగా ఐదుసంవత్సరాలూ వ్రతాన్ని ఆచరించి ఆరవ సంవత్సరంలో ఉద్యాపన నిర్వహించాలి.
ఉద్యాపన
ఐదుసంవత్సరాపాటు వ్రతాన్ని ఆచరించిన తరువాత వ్రతసంపూర్ణ ఫలప్రాప్తికొరకు ఆరవసంవత్సరంలో విధిగా ఉద్యాపన చేయాలి. ఈ ఉద్యాపన రెండురోజుపాటు ఆచరించవలసి ఉంటుంది. కార్తీక శుద్ధఏకాదశినాడు సాయంత్రం వ్రతాన్ని ప్రారంభించి ద్వాదశినాడు పూర్తిచేసుకోవాలి. దంపతులు మొదటిరోజు నిరాహారం ఉండవసి ఉంటుంది. రెండోరోజు బంధుమిత్లరు భోజనమైన తరువాత భుజించాలి.
పూజావిధానం
‘‘గోపద్మ వ్రత ఉద్యాపన విధి:’’ అనేగ్రంథంలో ఈ వ్రతంగురించి చక్కగా వివరించి చెప్పబడిరది. ఇంటి ఈశాన్యభాగంలో గోమయంతో అలికి ఐదురంగులతో ముగ్గుపెట్టి అక్కడ పీఠాన్ని ఉంచాలి. పీఠానికి అరటిస్తంభాలు, మామిడాకులు, చిత్రవిచిత్ర పుష్పాతో అంకరించాలి. దానిపై తెల్లటి వస్త్రాన్ని పరచి శక్తికొద్ది ధాన్యాన్నిపోయాలి. అనంతరం ముప్పైమూడు రాగికలశాను అలంకరించి పీఠంపై ఉంచాలి.
భార్యాభర్తలిరువురు పట్టువస్త్రాలు ధరించి విఘ్నేశ్వరపూజా, పుణ్యాహవాచనం పూర్తిచేసిన అనంతరం అఖండదీపారాధనం చేయాలి. పీఠంపైఉంచిన 33కలశాలో గంగనీరు, పంచామృతం, పంచగవ్యం, పంచపల్లవాలు, సుగంధద్రవ్యాలనువేసి వాటిపై పూర్ణపాత్రను ఉంచాలి. బంగారు లేదా వెండితో చేసిన 33రాధాకృష్ణుల ప్రతిమలను పంచగవ్యంతో శుద్ధిచేసి 33కలశాపై ఉంచాలి. అనంతరం రాధాకృష్ణులకు షోడశోపచారపూజ చేసి మధురపదార్థాలను నివేదించి కథాశ్రవణంచేయాలి. పిదప నీరాజన, మంత్రపుష్పాలను సమర్పించి పూజాసమర్పణ చేయాలి.
శ్లో॥ దేవదేవ జగన్నాథ గోపాల ప్రతిపాలక।
గోపదైః కృతసంత్రాణ గృహాణ కుసుమాంజలిమ్॥
అనే మంత్రంతో పుష్పాంజలి సమర్పించి, రాత్రి దైవసంకీర్తనతో జాగరణ చేస్తు కాలం గడపాలి. రెండవరోజు ఉదయాన్నే కాలకృత్యాలను నెరవేర్చుకొని నిత్య అనుష్ఠానాలను పూర్తిచేసుకోవాలి. పిదప పీఠంపైనున్న రాధాకృష్ణులకు, ఇతర దేవతలకు షోడశోపచారపూజ నిర్వహించాలి. 33పూర్ణపు భక్ష్యాలను తయారుచేసి నివేదించాలి.
వ్రతఫలితం
శ్లో॥ ఏవంయః కురుతేవిప్ర తస్య శ్రీరచలా భవేత్।
శ్లో॥ యం యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితమ్।
అన్తే విష్ణుపదే గచ్ఛేథ్సర్వపాప వివర్జితః॥
ఈ విధంగా ఎవరైతే ఈవ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వారికోరికలు నెరవేరుతాయి. పుత్రపౌత్ర ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. సర్వపాపాలనుండి విముక్తిచెంది దేహానంతరం విష్ణులోకానికి వెళతారని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది.
గోపద్మం పాట కొరకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
http://vaidikagrandhanidhi.blogspot.com/2017/12/blog-post_7.html
గోపద్మం పాట ఆడియో రూపంలో వినేందుకు ఈ లింక్ని ఉపయోగించండి
https://archive.org/details/Gopadmam_201712
అప్పా శ్యామప్రణీత్ శర్మ అవధాని
వేదపండితులుఅచ్చలాపూర్, మం. తాండూర్,
జి. మంచిర్యాల, తెలంగాణ





Blogger Comment
Facebook Comment