అష్త్టెశ్వర ప్రదాయిని మహాల‌క్ష్మీ దేవి

నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే|
శంఖచక్ర గదా హస్తే మహాల‌క్ష్మీ నమోస్తుతే||

మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాల‌క్ష్మిదేవి  అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల‌ను కల‌గజేసే అష్టల‌క్ష్మి రూపాన్నే వరల‌క్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికి, కొలిచినవారికి కొంగుబంగారంగా వెల‌సి ఉన్నది.
సిరిసంపదల‌కు అధిదేవత మహాల‌క్ష్మిదేవి జీవన సౌభాగ్యానికి దివ్యప్రతీక. సృష్టికి కారణభూతమైన ఆదిపరాశక్తినే మహర్షులు సుమనోహమైన రూపాల్లో చిత్రించి ఆరాధించారు. ఆ శక్తి మహిమల‌ను, దివ్యత్వ శోభల‌ను అనేక దేవతామూర్తులుగా మల‌చారు. ఆమె ప్రతీరూపం ఒక దివ్యసంకేతం. ప్రతి సంకేతం వెనక మనకు ఒక సందేశం కనిపిస్తుంది. ల‌క్ష్మీ అనే పదం సంస్కృత పదం ల‌క్ష్యం నుంచి వచ్చింది. అపార విశ్వాసం, భక్తిప్రపత్తులు కలిగినవారి దృష్టిలో మహాల‌క్ష్మిదేవి  సిరిసంపదల‌ను అనుగ్రహించడంతోపాటు, జీవితాన్ని అమృతప్రాయంగా చేస్తుంది.
మహాల‌క్ష్మిగా మనకు కనిపించే దేవి బంగారువర్ణంలో భాసిల్లే మోహనమూర్తి. ఆమె తన నాలుగుచేతుల‌తో  పూర్తిగా వికసించిన పద్మంపై ఆశీనురాలై ఉంటుంది. చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది. ఆమె ఒకచేతిలో పద్మం మొగ్గరూపంలో ఉంటుంది. వినిర్మల‌తకు, సౌందర్యానికి అది సంకేతం. పద్మం బురదనుంచి పుడుతుంది. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా వికసించే అపరిమితశక్తికి ఈ పంకం సంకేతం. నిత్యప్రవాహశీల‌మైన నీరు జీవానికి సంకేతం. ప్రవహించని నీరు నిల్వ‌ ఉండి పాడైపోతుంది. అదేవిధంగా ధనం కూడా ప్రవహిస్తూ చలామణీ అవుతుండాలి. ఈ ధనప్రవాహాన్ని ఆపి, ధనాన్ని కూడబెట్టేవారు ధనం, జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు. ఆరోగ్యప్రదమైన ఆర్థికవ్యవస్థ వెనక ఉన్న కీల‌కరహస్యం ఇదే.

దేవి జాజ్వల్య‌మానంగా తేజస్సును, సుసంపన్నతను ప్రసరిస్తూ ఉంటుంది. ధర్మ, అర్థ, కామ, మోక్షాల‌నే చతుర్విధ పురుషార్థాల‌కు ప్రతీకలు ఆమె చతుర్భుజాలు. జననమరణాల‌నే భయాల‌నుండి మనిషిని విముక్తంచేసి సత్యంవైపు నడిపించేది ఈ పరదేవతయే. మహాల‌క్ష్మి ధరించే ఆకుపచ్చని చీర అభివ్యక్త శక్తికి, వికాసానికి, సారభూతమైన భూదేవి పచ్చదనానికి సంకేతం. 
ల‌క్ష్మీదేవికి రెండువైపులా రెండు తెల్ల‌ని ఏనుగులు నిల‌బడి నీటిని చిమ్ముతూఉంటాయి. తన ధర్మాన్ని అనుసరించి వివేకంతో, నిర్మ మనస్సుతో, ఐహిక, ఆధ్యాత్మిక సంపద కోసం నిరంతరాయంగా చేసే ప్రయత్నానికి ఇది సంకేతమని చెప్పవచ్చు. దేవి సన్నిధిలో ఉండే గుడ్లగూబకు రెండు సంకేతార్థాలున్నాయి. ఒకదానికి అర్థం వివేకం, అదృష్టం. మరొక  సంకేతార్థం తెలివితక్కువతనం. అహంకారం, తెలివితక్కువతనంవల్ల‌ వచ్చే గర్వం వల‌న సంపద దూరం అవుతుంది. అందువ‌ల్ల‌నే ల‌క్ష్మిని చంచల‌ అన్నారు. విస్పష్టమైన జీవన ల‌క్ష్యం ఉన్నవారిచెంత ల‌క్ష్మి స్థిరంగా ఉంటుంది. 
ల‌క్ష్మికి సోదరి అల‌క్ష్మి. ఆమె దురదృష్టానికి హేతువు. ధన నియమాలు పాటించకపోతే కలిగే దుస్థితి అది. ల‌క్ష్మీ పూజకు సంధ్యాసమయం విశిష్టమైనది. పరిశుభ్రంగా ఉన్న ఇంటిలోకి మాత్రమే ఆమె ప్రవేశిస్తుందని నమ్మకం. మనస్సు, ఆత్మ సామరస్య, సౌందర్య ప్రాభవంతో మెలుగుతున్నచోట, ఆలోచనలు, సంవేదనలు, సామరస్య సౌందర్యమాధుర్యాల‌తో విల‌సిల్లేచోట శ్రీమహాక్ష్మి శాశ్వతంగా ఉండిపోతుందని చెబుతారు. ఆమె అడుగుపెట్టిన ప్రతీచోట ఆనంద స్రవంతులు పొంగిప్రవహిస్తాయి. సిరిసంపదతోపాటు జీవితాన్ని భగవదానంద ప్రదీప్తం చేస్తుంది శ్రీమహాల‌క్ష్మి. సంతోషంలేని సంపదలు దేనికి? ఆమెను మనసారా ఆరాధిస్తే జీవితం అతి మనోహర కళాఖండంగా ప్రకాశిస్తుంది. పవిత్ర ఆనంద సుధామయ మంత్రగీతమై రవళిస్తుంది. మన వివేకాన్ని మహదాశ్చర్యశిఖరాపై నిలుపుతుంది. సమస్త జ్ఞానాన్ని అధిగమించే ఆనందపు రహస్యాలు ఆవిష్కారమవుతాయి.
Share on Google Plus

About https://vaidikagrandhanidhi.blogspot.com/

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment